Sunday, June 27, 2010

దేవుడిని ఎలా గుర్తించాలి!

ప్రశ్నోత్తరాల పరంపరలో మరికొన్ని...

హిందూ జాగరణ సమితి ప్రశ్న (10) :

మీ దేవుడు క్రీస్తు అయితే, తనే దేవుడినని  అయన ఎప్పుడైనా చెప్పుకున్నాడా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :

హిందువులైన మీరు ఆరాధిస్తున్న దేవతలు అందరూ "నేనే  దేవుడను  నన్ను  ఆరాధించండి" అని చెప్పుకున్నారా? అలా చెప్పుకున్నవాళ్ళను మాత్రమే మీరు ఆరాధిస్తున్నారా? "నేనే దేవుడను" అని నోరారా ప్రకటించుకొని వారెవ్వరూ దేవుడు కారని మీరు సిద్దాంతీకరించగలరా? ఆమేరకు భారత ప్రజానీకమంతటిని మీరు ఒప్పించాగాలరా?
ఏసుక్రీస్తు దేవుడని ఆయనే చెప్పుకోనక్కరలేదు. ఇతను సూర్యుడు అని సూర్యుని మీద బోర్డు తగిలించి ఉండదు.
"యజ్ఞః ప్రజాపతిః" అంటే "యజ్ఞమైనవాడే ప్రజాపతి" అని మన భారతీయ వేదాలే ఘోషిస్తున్నాయి. అందుచేత దేవతలనబడిన వారిలో యజ్ఞమైనవాడు యేసు గాక ఇంకెవ్వరూ లేరు గనుక వేదాల సాక్ష్య్యాన్ని గౌరవిస్తూ మేము ఏసే దేవుడని నమ్ముతున్నాము.
హిందూ జాగరణ సమితి ప్రశ్న (11) :

మీ దేవుడే నిజమైన దేవుడని, హిందూ దేవుళ్ళు ఎవరూ దేవుళ్ళే కాదని మీ వాదన. అలాగైతే మీ దేవుడు జన్మించి 2009 సంవత్సరాలే అయింది. అంతకు ముందు దేవుడు లేడా! అంతకు ముందు మతాలు లేవా! భగవంతుని చేరుకున్న మహాత్ములు లేరా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :

"మా దేవుడే సత్యం,  మిగతా దేవుళ్ళు  దేవుళ్ళే కారు"  అని ఎవరూ మాట్లాడినా ఆ వైఖరి  ముమ్మాటికీ తప్పే.  ఈ విశ్వాని కంతటికీ ఉన్న దేవుడు ఒక్కడే.  ఈ మేరకు వేదాలు కూడా సాక్ష్య మిస్తున్నాయి. ఆ ఒక్క దేవుని వర్ణన వేదాలలో స్పష్టంగా వ్రాయబడింది.  ఆ పోలికలన్నీ యేసుక్రీస్తులో స్పష్టంగా కనబడుతున్నాయి.  గనుక  "యేసు మనందరి దేవుడు"  అని మేము మా సోదర భారతీయులకు విన్నవిస్తున్నాము.  ఈ మాట నమ్మటం ఇష్టంలేని వారు నమ్మకుండా వదిలేయవచ్చు.  కాని మాకు తెలిసినంతవరకూ,  మేము సత్యమని నమ్మినా దాన్ని ప్రచారం చేసుకునే హక్కు మాకు ఉంది.
యేసు అవతరించక ముందు కూడా భగవంతుని చేరిన మహాత్ములు ఉన్నారు.  అయితే వారు కూడా వేదాలలో ప్రవచించ బడిన యజ్ఞపురుషుడి మీద విశ్వాసం ఉంచారు గనుకనే వారు భగవంతుని చేరారు. 

"ప్రజాపతి మన కోసం యజ్ఞం కాబోతున్నాడు"  అని క్రీస్తు పూర్వం జీవించిన మహాత్ములు నమ్మారు.  "ఆ ప్రజాపతి మన కోసం యజ్ఞంగా  మరణించి లేచాడు;  తద్వారా ఆయన వేద ప్రవచనాలను నెరవేర్చాడు"  అని క్రీస్తు తర్వాత జీవిస్తున్న మహాత్ములు నమ్ముతున్నారు, ధన్యులవు తున్నారు,  తరిస్తున్నారు.

(మీ సమయాన్ని వెచ్చించి ఓపిగ్గా చదివిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అందుబాటులో లేని వారికోసం ఇంకా మరికొన్ని మరలా కలిసాక)