Sunday, June 27, 2010

దేవుడిని ఎలా గుర్తించాలి!

ప్రశ్నోత్తరాల పరంపరలో మరికొన్ని...

హిందూ జాగరణ సమితి ప్రశ్న (10) :

మీ దేవుడు క్రీస్తు అయితే, తనే దేవుడినని  అయన ఎప్పుడైనా చెప్పుకున్నాడా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :

హిందువులైన మీరు ఆరాధిస్తున్న దేవతలు అందరూ "నేనే  దేవుడను  నన్ను  ఆరాధించండి" అని చెప్పుకున్నారా? అలా చెప్పుకున్నవాళ్ళను మాత్రమే మీరు ఆరాధిస్తున్నారా? "నేనే దేవుడను" అని నోరారా ప్రకటించుకొని వారెవ్వరూ దేవుడు కారని మీరు సిద్దాంతీకరించగలరా? ఆమేరకు భారత ప్రజానీకమంతటిని మీరు ఒప్పించాగాలరా?
ఏసుక్రీస్తు దేవుడని ఆయనే చెప్పుకోనక్కరలేదు. ఇతను సూర్యుడు అని సూర్యుని మీద బోర్డు తగిలించి ఉండదు.
"యజ్ఞః ప్రజాపతిః" అంటే "యజ్ఞమైనవాడే ప్రజాపతి" అని మన భారతీయ వేదాలే ఘోషిస్తున్నాయి. అందుచేత దేవతలనబడిన వారిలో యజ్ఞమైనవాడు యేసు గాక ఇంకెవ్వరూ లేరు గనుక వేదాల సాక్ష్య్యాన్ని గౌరవిస్తూ మేము ఏసే దేవుడని నమ్ముతున్నాము.
హిందూ జాగరణ సమితి ప్రశ్న (11) :

మీ దేవుడే నిజమైన దేవుడని, హిందూ దేవుళ్ళు ఎవరూ దేవుళ్ళే కాదని మీ వాదన. అలాగైతే మీ దేవుడు జన్మించి 2009 సంవత్సరాలే అయింది. అంతకు ముందు దేవుడు లేడా! అంతకు ముందు మతాలు లేవా! భగవంతుని చేరుకున్న మహాత్ములు లేరా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :

"మా దేవుడే సత్యం,  మిగతా దేవుళ్ళు  దేవుళ్ళే కారు"  అని ఎవరూ మాట్లాడినా ఆ వైఖరి  ముమ్మాటికీ తప్పే.  ఈ విశ్వాని కంతటికీ ఉన్న దేవుడు ఒక్కడే.  ఈ మేరకు వేదాలు కూడా సాక్ష్య మిస్తున్నాయి. ఆ ఒక్క దేవుని వర్ణన వేదాలలో స్పష్టంగా వ్రాయబడింది.  ఆ పోలికలన్నీ యేసుక్రీస్తులో స్పష్టంగా కనబడుతున్నాయి.  గనుక  "యేసు మనందరి దేవుడు"  అని మేము మా సోదర భారతీయులకు విన్నవిస్తున్నాము.  ఈ మాట నమ్మటం ఇష్టంలేని వారు నమ్మకుండా వదిలేయవచ్చు.  కాని మాకు తెలిసినంతవరకూ,  మేము సత్యమని నమ్మినా దాన్ని ప్రచారం చేసుకునే హక్కు మాకు ఉంది.
యేసు అవతరించక ముందు కూడా భగవంతుని చేరిన మహాత్ములు ఉన్నారు.  అయితే వారు కూడా వేదాలలో ప్రవచించ బడిన యజ్ఞపురుషుడి మీద విశ్వాసం ఉంచారు గనుకనే వారు భగవంతుని చేరారు. 

"ప్రజాపతి మన కోసం యజ్ఞం కాబోతున్నాడు"  అని క్రీస్తు పూర్వం జీవించిన మహాత్ములు నమ్మారు.  "ఆ ప్రజాపతి మన కోసం యజ్ఞంగా  మరణించి లేచాడు;  తద్వారా ఆయన వేద ప్రవచనాలను నెరవేర్చాడు"  అని క్రీస్తు తర్వాత జీవిస్తున్న మహాత్ములు నమ్ముతున్నారు, ధన్యులవు తున్నారు,  తరిస్తున్నారు.

(మీ సమయాన్ని వెచ్చించి ఓపిగ్గా చదివిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అందుబాటులో లేని వారికోసం ఇంకా మరికొన్ని మరలా కలిసాక)

Thursday, April 29, 2010

ఏర్చి, కూర్చి, మార్చి వ్రాసిన బైబుల్ గ్రంధం ఎలా నమ్ముతున్నారు!

ప్రశ్నోత్తరాల  పరంపరలో మరికొన్ని...
హిందూ జాగరణ సమితి ప్రశ్న (7) :
మీ పవిత్ర గ్రంధం బైబిలును ఒక వ్యక్తి రాయలేదని, అనేకమంది, అనేక కాలాల్లో, అనేక భాషల్లో ఏర్చి, కూర్చి, మార్చి వ్రాసిన గ్రంథమని మీకు తెలుసా! మీ గ్రంధం క్రీస్తు తదుపరి సుమారు నాలుగు దశాబ్దాల కాలం తరువాత వెలువడిందని మీకు తెలుసా! అన్ని వందల సంవత్సరాలు ఎందుకు పట్టిందో చెప్పగలరా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :
మా పవిత్ర గ్రంధం అయిన బైబుల్ ఎలా వ్రాయబడిందో మాకే తెలియదని జాగరణ సమితి వారు భావించటం వారి గొప్ప "జ్ఞానానికి" తార్కాణం!
మహాశయులారా! మా పరిశుద్ధ గ్రంధమైన బైబుల్ ఒకే పుస్తకం కాదు. అది 66 పుస్తకాల సంకలనం. 1,600 ఏళ్ళ పాటు, వేరు వేరు దేశాలలో, ఒకరితోనోకరికి ఏమాత్రమూ పరిచయం లేని 40 మంది ప్రవక్తల ద్వారా హెబ్రీ, గ్రీకు, అరామిక్ భాషలలో వ్రాయబడిన 66 గ్రంధాలను కలిపి ఒక గ్రంధంగా కూర్చి చూస్తే, పూసల దండలో దారం ఉన్నట్లు ఆ 66 గ్రంధాలలో ఒకే సందేశం ప్రవహిస్తూ ఉండటం మేము గమనించాము. బైబుల్ దైవ గ్రంథమని మేము నమ్మడానికి ఇది కూడ ఒక కారణం.
ఆ 40 మంది ప్రవక్తలనూ ఒకానొక మానవాతీత దైవశక్తి నడిపించి వ్రాయించిందని మాకు నిరూపణలు దొరికాయి. బైబుల్లోని మొదటి గ్రంధం క్రీస్తు పూర్వం 1500 ఏళ్ళనాడు వ్రాయబడింది. చివరి పుస్తకం క్రీస్తు శకం నూరేళ్ళ నాడు వ్రాయబడింది.
హిందూ జాగరణ సమితి ప్రశ్న (8) :
ఇన్ని తప్పులు దొర్లినా మీ గ్రంధాన్ని ఇంకా దేవుని వాక్కుగా మీరు నమ్ముతున్నారా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :
ఏం తప్పులు దొర్లాయి మహాశయా?! ఎక్కడ తప్పులు దొర్లాయో బైబుల్లో వచనాలను చూపించకుండానే " - ఇన్ని తప్పులు దొర్లినా" అంటున్నారంటే, ఏలినవారి ఉబలాట మంతా క్రైస్తవ్యాన్ని దూషించటంలోనే ఉన్నదని అర్ధమౌతున్నది.
హిందూ జాగరణ సమితి ప్రశ్న (9) :
మీరు దాన్ని దేవుని వాక్కుగా నమ్మితే మీ దేవునికి ఈ చిన్న విషయాలు ఎందుకు తెలియకుండా పోయాయి!
క్రైస్తవ పరిషత్ సమాధానం :
అసలు బైబులులో శాస్త్రవిరుద్ధమైన విషయాలు లేనే లేవని మీము ఇదివరకే స్పష్టికరించాము గనుక "మీ దేవునికి ఈ చిన్న విషయాలు తెలియకుండా ఎందుకు పోయాయి?" అన్న ప్రశ్నే ఇక్కడ అసంగతమూ, అర్ధరహితమూ అయిపొయింది.
పైపెచ్చు "మీ దేవుడు" అన్న పదప్రయోగమే అత్యంత అభ్యంతరకరం. ఏ దేవుడు హిందువులను సృష్టించాడో, ఆ దేవుడే క్రైస్తవులను, ముస్లింలను సృష్టించాడని మా ప్రగాఢ విశ్వాసం అందుచేత మీ దేవుడు, మా దేవుడు అంటూ మాట్లాడటం అత్యంత అభ్యంతరకరం. అలాంటి పదప్రయోగం పండితులకు యోగ్యమైనది కాదు.
(మీ సమయాన్ని వెచ్చించి ఓపిగ్గా చదివిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అందుబాటులో లేని వారికోసం ఇంకా మరికొన్ని మరలా కలిసాక)

Monday, April 26, 2010

శాస్త్రవేత్తలను చంపిన ఘనత ఎవరిది!

ప్రస్నోత్తరాల పరంపరలో మరికొన్ని... (శాస్త్రవేత్తలను చంపిన ఘనత ఎవరిది!)
 హిందూ జాగరణ సమితి ప్రశ్న :
సూర్యుని చుట్టూ భూమి తిరుగు చున్నది కానీ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుట లేదు అని యదార్ధం చెప్పినా బైబులుకు వ్యతిరేకంగా ఉందని కోపర్నికస్, గెలీలియోల వంటి శాస్త్రజ్ఞులను హింసించి, అదే మాట అన్నందుకు బ్రూనో అనబడే శాస్త్రజ్ఞుని ఆరు సంవత్సరాలు  జైల్లో పెట్టి, అతి కిరాతంగా హింసించి, చివరకు సజీవ దహనం చేసిన ఘనత మీ మతానిది కాదా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :

"భూమి చుట్టూ సూర్యుడు తిరుగుచున్నాడు" అని బైబుల్లో ఎక్కడా చెప్పబడలేదు. సుర్యకేంద్రక సిద్ధాంతం బైబుల్ కు వ్యతిరేకం కాదు. కోపర్నికస్, గెలీలియోలు కనుగొన్న సుర్యకేంద్రక సిద్ధాంతం ఆనాటి మత పెద్దలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్న ఉదంతం అది. ఆ తప్పు క్రైస్తవ మతానిది కాదు, కొందరు నకిలీ క్రైస్తవులది.
ఇలాగే మత పెద్దలు తమ నిరకుశ అధికారాన్ని ఉపయోగించి అమాయకులను, నిర్దోషులను, సజ్జనులను హింసించి చంపిన ఉదంతాలు అన్ని మతాలలోను ఉన్నాయి. అలాంటి దురదృష్టకర సంఘటనలు ఆధారం చేసుకొని మతాన్ని  దూషించటం, ద్వేషించటం తెలివితక్కువపని. అన్ని మతాలు గొప్పవే! అయితే అన్ని మతాలలోను ఆ మతాల సారం ఎరుగని నకిలీ భక్తులు ఉన్నారు.
హిందూ జాగరణ సమితి ప్రశ్న :

చివరికి ఆ శాస్త్రజ్ఞులు చెప్పినదే నిజమేనని మీ మతం  1820 సంవత్సరంలో ఒప్పుకుంది. అప్పుడు మీ మత గ్రంధం యొక్క పరువు ఏమయ్యింది!
క్రైస్తవ పరిషత్ సమాధానం :

కోపెర్నికస్, గెలీలియోలను చర్చి అధికారులు దోషులుగా తీర్పు తీర్చినప్పుడు వారు బైబిలులోని వచనాలను ఆధారంగా చూపించలేదు - గనుక తరువాత చర్చి అధికారులు తమ అభిప్రాయాలను మార్చుకున్నప్పుడు చర్చి అధికారుల  పరువే  పోయింది.  బైబిల్ గ్రంధం   యొక్క పరువుకు  వచ్చిన  నష్టం ఏమీ లేదు!
హిందూ జాగరణ సమితి ప్రశ్న :
పురుషునికి ఎడమవైపు ప్రక్కటెముకలు, కుడి వైపు ప్రక్కటెముకల కన్నా ఒకటి తక్కువ ఉంటాయని  మీ మత గ్రంధం చెప్పింది. అది నిజం కాదని, రెండు వైపులా ప్రక్కటెముకలు సమంగా ఉంటాయని నిరూపించినందుకు వెసాలియన్ అనబడే శాస్త్రజ్ఞుని శిక్షించి అతని చావుకు కారణభూత మైనది మీ మతం కాదా!
క్రైస్తవ పరిషత్ సమాధానం :

"ప్రతి పురుషునికి ఒక వైపు ప్రక్కటెముక తక్కువగా ఉంటుంది" అని బైబుల్ గ్రంధంలో ఎక్కడా వ్రాయబడలేదు. హిందూ జాగరణ సమితి వారు బైబుల్ ను గూర్చి ఏమీ తెలుసుకోకుండానే విమర్శకు బయలుదేరారు. జాగరణ సమితి వారు ఈవిషయంలో మొదట మేల్కొనటం మంచిది.
ప్రతి విషయానికీ "ఈ తప్పు మీ మతానిది కాదా?" అంటూ ఒంటికాలిమీద లేస్తున్న జాగరణ సమితి వారు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి తరం లోనూ మతపెద్దలు చేస్తున్న తప్పుడు పనులను ఖండించిన అసలైన భక్తులు క్రైస్తవుల్లో ఉన్నారు. గనుక ఆ తప్పులు క్రైస్తవ మతానివి కావు, అహంకార పూరితులైన కొందరు అధికారులు చేసిన తప్పులు అవి.
హిందూ జాగరణ సమితి ప్రశ్న :
మన భూమండలం 6,000 సంవత్సరాల క్రితం సృష్టించ బడిందని మీ గ్రంధం చెపుతున్నది, అది నిజం కాదని, భూమి వయస్సు కోట్లాది సంవత్సరాలని నేటి శాస్త్రజ్ఞులు భూగర్భంలో దొరికిన ఎముకలను, ఇతర పదార్దాలను "కార్బన్ డేటింగ్" ద్వారా పరీక్ష చేసి నిర్ణయిస్తున్నారు. దానికి మీరేమంటారు!
క్రైస్తవ పరిషత్ సమాధానం :

"భూమండలం 6,000 సంవత్సరాల క్రితం సృష్టించ బడింది" అని బైబుల్లో ఎక్కడ వ్రాయబడి ఉందొ జాగరణ సమితి వారు రెఫరెన్సు కూడా వ్రాస్తే బాగుండేది. జాగరణ సమితి వారి బైబుల్ పరిజ్ఞానం చాలా గొప్పది! వందలసార్లు బైబుల్ చదివిన మాకే కనిపించని సంగతులు బైబుల్లో జాగరణ సమితి వారికి  కనిపించాయి! బాబూ! బైబుల్లో  భూమి  వయస్సు  6,000 సంవత్సరాలని  ఎక్కడా చెప్పబడలేదు. ప్రస్తుత యుగం ప్రారంభమై దాదాపు  6,000 సంవత్సరాలు  అని  మాత్రమే  బైబుల్ చెబుతున్నది.
(మీ సమయాన్ని వెచ్చించి ఓపిగ్గా ఇంతవరకూ చదివిన మీకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. అందుబాటులో లేని వారికోసం ఇంకా మరికొన్ని మరలా కలిసాక)

Saturday, March 20, 2010

మత యుద్దాలు - మారణ హొమాలు - బాధ్యులెవరు?


మీరు కారణ జన్ములు. ఈ  బ్లాగ్  వీక్షిస్తున్న మీకు  ప్రత్యేక  ధన్యవాదాలు.   మీరు కారణ జన్ములంటే బహుశా  నమ్మకం  కలుగటం  లేదేమో.   ఆ మాటకొస్తే  మీరే  కాదు  ప్రతి  మనిషి  కారణజన్ముడే (జన్మురాలే).  అది తెలియక అకారణంగా ఎందరో అంతరించారు అంతరిస్తూనే ఉన్నారు.   కొందరు మాత్రమే  పైకి  రాగలిగారు  శాశ్వతంగా  చరిత్ర  పుటల్లో మిగిలిపోయారు.     ఒకసారి గమనించండి. ఈ బ్లాగ్ లోకి  ప్రవేశించక  ముందు  మీ  ఆలోచన  ఎలాంటిది? ఎలాఉంది?  మీకు  తెలియకుండానే  ఏదో తెలుసుకోవాలనే తపన ఉండిఉంటుంది  కదూ.  ఆ  తపనే  ప్రతి  మనిసిలొనూ  ఉండేది.  అందుకే కదా  అది  బిగ్బాంగ్  వరకు  వెళ్ళింది.  ఇక  విషయానికి  వద్దాం.  అనవసరమైన  ద్వేషం  లేకుండా  సహృదయంతో  పరిశీలించండి:     


కొంతకాలం  క్రితం  హిందూ ధర్మ  జాగరణ  సమితి  పేరిట  కొందరు  కొన్ని  ప్రశ్నలు  లేవనెత్తారు.  దానికి జవాబుగా  క్రైస్తవ  పరిషత్  పేరిట  సమాధానాలు ఇచ్చారు. ఆసక్తికరమైన  ఈ  ప్రశ్నోత్తరాలు  గమనిద్దాం. 

జాగరణ  సమితి  ప్రశ్న: 


ఒక చేత్తో కత్తి,  ఒక చేత్తో బైబుల్ పట్టుకుని మతయుద్ధాలు చేసి, కోట్లాదిమంది  గొంతులు కోసి,  రక్తాన్ని ఏరులై  పారించిన  ఘనత  మీ  మతానిది  కాదా!

పరిషత్  సమాధానం:


నిష్కారణంగా, అనవసరంగా, ప్రజలను  హతమార్చి  రక్తపుటేరులు  పారించిన  వ్యక్తులు అన్ని మతాలలొనూ ఉన్నారు.  అలంటి కొందరు నాస్తికులు కూడా ఉన్నారు. ఒక మతంలోని వ్యక్తులు తప్పు చేసినంత  మాత్రాన  ఆ  మతం  తప్పు  చేసినట్టు  కాదు.  క్రైస్తవ మతస్థులు  కొందరు  అనవసర  రక్తపాతం జరిగించిన  మాట  వాస్తవమే.  అయితే  అలా చేయమని  బైబుల్  చెప్పలేదు.  ఏసుక్రీస్తు  ప్రభువు చెప్పలేదు.  అందుచేత  అది  క్రైస్తవ మతం  చేసిన  తప్పు  కాదు;  క్రైస్తవ  మతం  లో  ఉంటూ  క్రీస్తు భోదనలను పెడచెవిని పెట్టిన నకిలీ క్రైస్తవుల చేత  ఆ  రక్తపాతం  జరిగింది.  అలాంటి  వ్యక్తులు వాస్తవానికి  క్రైస్తవులు  కారు.  వారి  ప్రవర్తన  క్రైస్తవ  మత  సిద్దాంత  ప్రకారమైనది  కాదు.

జాగరణ సమితి ప్రశ్న:


'మంత్ర గత్తె' లు అనే  నెపంతో లక్షలాది మంది అమాయక  స్త్రీలను నిర్దాక్షిణ్యంగా  చంపినా  ఘనత  మీ మతానిది కదా!

పరిషత్ సమాధానం:


ఈ ప్రశ్నకు కూడా పై జవాబే వర్తిస్తుంది.  అలా మంత్రగత్తెలను  చంపమని  ఏసుక్రీస్తు ఆదేసించలేదు.  అసలు ఏ కారణం చేతనైనా నరహత్య  చేయకూడదని  బైబుల్ స్పష్టంగా అజ్ఞాపిస్తుంది.  ఆ మాట  కొస్తే  మంత్రగత్తెలు, మంత్రగాళ్ళు అనే  నేరం మోపి  కొందరు వ్యక్తులను  రాళ్లతో,  కర్రలతో  కొట్టి  చంపుతున్న సంఘటనలు  భారత దేశంలో   పల్లెలలో కూడా   ఎన్నో  జరుగుతున్నాయి.  అలా  చంపుతున్న  వారు  క్రైస్తవులు  కారని  మీకు తెలుసు.  ఏదిఏమైన  ఒక  మతంలోని  వ్యక్తులు  చేసే  అజ్ఞానపు  పనులు  ఆ మతం లోని దైవావతారానికి, మతగ్రంధానికి  మనం  ఆపాదించకూడదు.   ఈ  సూత్రం  అన్ని మతాలలోని  వ్యక్తులకు  వర్తిస్తుంది. 


(ఓపిగ్గా ఇంతవరకూ చదివిన మీకు మరోసారి ధన్యవాదాలు. అందుబాటులో లేని వారికోసం ఎన్నో ఉన్నాయి.  ఇంకా మరికొన్ని మరలా కలిసాక) 
  

Friday, March 19, 2010

ఉపోద్ఘాతం-పరిచయం

   ఈ బ్లాగును ప్రోరంభించాలనే తలంపు కేవలం సాటి మనుషులలో అపోహలు తొలగించటానికే. ప్రతి మనిషికి ఏదో ఒక నమ్మకం ఉంటుంది. దేవుని నమ్మే వారు దైవభక్తి సాధన చేయాలనీ, నమ్మని వారు బహుశా నాస్తికులైనా తమ సిద్దంతాలపై నమ్మక ముంచుతారు సిద్ధాంత కర్తలపై కొంతైన భక్తి భావం ప్రదర్శిస్తారు. ఇక సైన్స్ విషయాని కొస్తే ప్రతిదానికి రుజువు కావాలంటుంది. క్రొత్త రుజువులు దొరికితే పాతవి గతిస్తాయి. ఎవరి నమ్మకం వారిది ఎవరి సిద్దాంతం వారిది ఎవరి రుజువులు వారివి. ఎవరు ఎవరినీ ద్వేషించ నవసరం కాని దూషించ నవసరం కాని లేవు. మానవ జాతి ఆరంభం నుండి మతం పేరుతో అనేక అరాచకాలు జరిగాయి. కొందరు వందేమాతరం పాడటం మా మత విశ్వాసాలకు భంగం కలిగిస్తున్నది. ఎందుకంటే మేము తల్లిని గౌరవిస్తాం కానీ పూజించం. దేవుణ్ణి తప్ప దేశమాతనైనా పూజించం అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మతమార్పిడులు చేస్తున్నారనే ఆరోపణలతో హింసకు గురికా బడుతున్నారు. మనిషికి కావాల్సింది మతమో తాను నమ్మిన దైవమో తేల్చుకోలేక దైవన్వేషకులు సతమత మౌతున్నారు. మతవిశ్వాసాలు దేవునిపై నమ్మకం మనసులో ఉదయించేవి కాని శరీర సంబందమైనవి కావని అందరికి తెలుసు. ఇక చుట్టూ జరిగే అరాచకాలు చూసి దైవత్వాన్నే శంకించే పరిస్థితి మరి కొందరిది.


    మూఢ త్వం, గ్రుడ్డితనం, అరాచకం, మొదలుగునవి ఎక్కడ వున్నా ఖండించాల్సిందే. ఐనా మానవుని లోని జిజ్ఞాస చావదు. ప్రయత్నం వీడడు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కలిసి సృష్టి ఆరంభ రహస్యాన్ని తెలుసుకోవాలని బిగ్బాంగ్ ప్రయోగానికి సంనద్ధమైయ్యారు. ఐతే వీటికి మూలం ఏమిటి? వాస్తవం ఏమిటి?. ఏది సత్యం? ఏదసత్యం? తెలిసింది తెలుసుకున్నది పంచుకోవాలనే తలంపుతో ఈనా ప్రయత్నం. కొందరు క్రైస్తవ విశ్వాసాలను కించ పరుస్తుంటే ఎందుకో తీరని వ్యధ కలుగు తుంది. ఇటీవల ప్రతి మతం వారు తమది మతం కాదు జీవిత విధానమే నని చెప్పుకుంటున్నారు. దేవుణ్ణి తెసుకోవాలంటే తమకు నచ్చింది తమ దైన శైలిలో అనవసరంగా మరొకరిని కించ పరిచే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఏ మతాన్ని కాని సంస్కృతిని కాని దేశాన్ని కాని కించ పరచే ఎలాంటి ఆలోచన నాకు లేదు రాబోదు.


     మంచి ఎక్కడున్నా గ్రహించాలని సత్యమెక్కడున్నా స్వీకరించాలని జ్ఞాన మెక్కడున్నా సముపార్జించాలని తృష్ణ గొని ఉన్నా. అన్యధా భావించకుండా సత్యమేదో సమస్తమైన వారలు గ్రహించాలని గ్రహించి మీకు తెలిసిన సత్యాలు తెలియజేయ గలరని ఆశిస్తున్నా. అపోహలు తొలగాలని, సుహృద్భావ వాతావరణం నెలకొనాలని, ద్వేష బీజాలు నశించాలని ప్రారంభిస్తున్నా. నేను నేర్చుకునే వాడినే. చదువరులకు ప్రత్యేకించి విమర్శకులకు ఇదే నా ప్రత్యేక ఆహ్వానం. మీ స్పందన నాకు అమూల్యం.


(ప్రస్తుతానికి ఈ ఉపోద్ఘాతం ఆపి ప్రశ్నోత్తరాలతో మళ్లీ కలుద్దాం)